హైదరాబాద్,అర్జున్ సమాచారం:
సింగరేణి నిండా కుంభకోణాలు ఉన్నాయని నేను చెప్పినా. కాంగ్రెస్ చేసిన కుంభకోణాలని ప్రజల ముందు పెడితే రేవంత్ రెడ్డి, నిన్న అడ్డగోలుగా మాట్లాడిండు. నువ్వు ఉత్తరం రాస్తే నేను విచారణకు ఆదేశిస్తా అన్నాడు. మీడియా ముందు మాట్లాడుడు కాదు, దమ్ముంటే సింగరేణి కుంభకోణం పైన ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్లపైన విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
శుక్రవారం అయన తెలంగాణ భవన్ లో నిర్వహించిన నర్సంపేట నియోజక వర్గ సమావేశంలో మాట్లాడారు.
కేటీఆర్ మాట్లాడుతూ ఆఅంశంలోనే కాదు, దమ్ముంటే నువ్వు చేసిన అక్రమాలపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణకి ఆదేశించు. నీ బావమరిది సింగరేణిలో కొల్లగొట్టిన రూ. 10వేల కోట్ల కుంభకోణంపై విచారణ వెయ్యి. సింగరేణిలో నువ్వు చేసిన సోలార్ పవర్ కుంభకోణం బయటపెడతా. సింగరేణిని బొందపెట్టి ఇప్పుడు 70 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణిని కాదని విదేశీ బొగ్గు తేవడానికి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు.
గతంలో రాష్ట్రంలో 24 గంటల పాటు కరెంట్ పోకుండా అండగానిలబడింది సింగరేణి. ఇప్పుడు అదే సింగరేణిని బద్నామ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సంక్షోభంలోకి నెట్టిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి బొగ్గు తేవాలి, కరెంట్ కొనాలి అని అంతా ఆగమైనంక చెబుతున్నాడు. సింగరేణి బొగ్గు వద్దు, భారతదేశంలో ఉండే బొగ్గు వద్దని అంటున్న ముఖ్యమంత్రి విదేశీ బొగ్గు కావాలి అంటున్నాడు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొంటే కమీషన్లు వస్తాయి. సింగరేణిలో 3,800కి టన్నుకి దొరికే బొగ్గు, విదేశాలలో అయితే 10, 12 వేలు వస్తాయి కాబట్టి అక్కడ కమీషన్లు కొట్టడం కోసమే ఈ కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి. ఈఎంఐ కట్టకుంటే ఈయన పదవి పోతుంది. కాబట్టే ఇప్పుడు బొగ్గు పేరుతో స్కామ్ చేసి ముడుపులు కట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ కి కట్టే ఈఎంఐల కోసమే ఇక్కడ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నాడు. ఈ రికవరీ ఏజెంట్ లాంటి ఈ ఏఐసీసీ జనరల్ సెక్రటరీకి రేవంత్ రెడ్డి కమీషన్లు కట్టకుంటే ఆయన పదవిని గుంజి పడేస్తాడు. రేవంత్ రెడ్డి పదవి రెన్యువల్ కాదు. రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అందరిని మోసం చేస్తున్నాడు. సింగరేణి భుజం మీద తుపాకీ పెట్టి టెండర్లు, కమీషన్లు లెక్కలు వేసుకుంటున్నాడు.
సింగరేణిలో ఉత్పత్తి తగ్గించిండు. అందుకే ఈరోజు కరెంట్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర బొగ్గు లేదు. సింగరేణికీ రూ. 60వేల కోట్ల బాకీలు పెండింగ్ లో పెట్టి బొగ్గు ఇవ్వడం లేదని బద్నామ్ చేస్తున్నాడు. కరెంట్ సరఫరా వ్యవస్థను పండబెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొందామంటే కరెంట్ లేదని అబద్ధాలు చెబుతున్నాడు. ఒకనాడు 24 గంటల కరెంట్ వచ్చిన తెలంగాణలో ఇప్పుడు కరెంట్ ఎందుకు లేదు? కరెంట్ కొనుగోలు కోసం ఛత్తీస్ ఘడ్ తో ఒప్పందం చేసుకుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని కుంభకోణం అన్నాడు. ఇప్పుడేమో కొందామంటే కరెంట్ లేదు అని చెబుతున్నాడు. 3 రూపాయల 90 పైసలకు అప్పుడు మేము కొంటే కుంభకోణం. అయితే, ఇప్పుడు 15 రూపాయలు పెట్టి కొనాలని చూస్తున్న కాంగ్రెస్ తీరుని ఏమనాలి? కరెంట్ కొనుగోళ్లపైన కుంభకోణం అంటూ ఒక కమిషన్ వేసిండు. బద్నాం చేయడానికి కుట్ర చేసిండు. రాష్ట్రంలో 30 లక్షల కరెంట్ పంపు సెట్లు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకి కరెంట్ కావాలి, తెలంగాణ రైతులకు కరెంట్ ఇయ్యాలి. విద్యుత్ పై ఆధారపడిన కుటీర పరిశ్రమలు, పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వాలి. అందుకే ఆనాడు అన్ని ప్రయత్నాలు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చాము. కానీ కాంగ్రెస్ రాగానే కరెంట్ కోతలు వచ్చాయి. రేవంత్ రెడ్డి 1000 టీఎంసీల నీళ్లను సముద్రంలో వదిలిపెట్టిండు. ఇప్పటిదాకా సాగునీటి పైన, కరువు పరిస్థితుల పైన స్పందించకుండా కాలం వెళ్ళిపోయినాక ఇప్పుడు నాటకాలు చేస్తున్నాడు. ఆరు నెలల ముందే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయాలని మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేశాము. కాళేశ్వరం ప్రాజెక్టులో వృథాగా కిందికి పోతున్న నీళ్లను అక్కడి దాకా పర్యటించి ప్రభుత్వానికి ప్రజలకు చూపించాము. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగిస్తే ఇన్ని సంవత్సరాలు తాను చేసిన దొంగ మాటలు ప్రజలకు ముందు తేలిపోతుందని రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తి పోయలేదు. వృథాగా కిందికి పోయిన నీళ్లు ఎత్తి పోయకుండా ఇప్పుడు ఎల్ నినో పేరుతో చేతులెత్తేసిండు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తమంటే రేవంత్ రెడ్డి ఎత్తలేదు. ఉన్న నీళ్లు కిందికి పోయాయి, రాష్ట్రంలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి, తాగునీటికి సాగునీటికి కొరత మొదలయ్యింది. ఇప్పుడు ఎల్ నినో వచ్చింది నేనేం చేసానని రేవంత్ రెడ్డి చేతులెత్తేస్తున్నాడు. ఇదే ఎల్ నినో దేశమంతా ఉంది, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటకలో కూడా ఉంది. కానీ ఆంధ్రాలో అక్కడ ముఖ్యమంత్రి జలపండగ చేస్తున్నాడు. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం దాకా నీళ్లు తీసుకుపోయిండు. 400 టీఎంసీలను పట్టిసీమ పంపుతో ఎత్తిపోస్తున్నాడు. పోతిరెడ్డిపాడు నుంచి మొదలుకొని ఆంధ్రాకి అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుకున్నారు. ఆంధ్రాలో 700 కిలోమీటర్ల కింది దాకా నీళ్లు తీసుకుపోతే 70 కిలోమీటర్ల దూరమున్న మహబూబ్ నగర్ కి కూడా నీళ్లు తీసుకోపోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం పాలమూరు ఎత్తిపోతల ద్వారా ఈరోజు తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలుస్తుండే. కానీ కాంగ్రెస్ పాలన వల్ల కరువు దిశగా పోతున్నది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఆంధ్రలో జల పండగ ఎందుకుంటది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? తెలంగాణ నుంచి పారే నీళ్లతో ఆంధ్రాలో ప్రాజెక్టులు నిండుతున్నాయి. కానీ తెలంగాణలో క్రాప్ హాలిడే అని కాంగ్రెస్ చెబుతుంది. దండం పెట్టి ప్రభుత్వానికి చెబుతున్నా, రైతులు కష్టాల్లో ఉన్నారు, రాష్ట్రం కష్టంలో ఉంది. రాజకీయాలు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని అన్నారు.
====================